గుంటూరు కేంద్రంగా కమిషనరేట్
గుంటూరు : దశాబ్దకాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన గుంటూరు కమిషనరేట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో గుంటూరు, విజయవాడ కలిపి మెగా కమిషనరేట్ చేయాలని ప్రతిపాదించారు. సాంకేతిక కారణాల వలన ఆ ప్రతిపాదన అటకెక్కింది. రాజధాని ఏర్పాటైనప్పటికీ పోలీస్‌శాఖ పరంగా ఇంతవరకు ఎటువంటి మార్పులు లేకపోవడంతో రాజధానిలో భద్రత వ్యవహారం పోలీసులకు సమస్యగా మారింది. వీటన్నింటిని అధిగమించి గుంటూరు, రాజధాని ప్రాంతంతో కలిపి ఒక కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు అర్బన్ ఎస్పీ రామకృష్ణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు డీజీపీతో పాటు పోలీస్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ప్రతిపాదనలోని అంశాలివి..
తుళ్లూరు పోలీస్ స్టేషన్ కూడా అర్బన్ జిల్లాలో కలిపి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిషనర్‌గా ఐజీ స్థాయి అధికారి ఉంటారు. జాయింట్ కమిషనర్లుగా డీఐజీ స్థాయి అధికారులను నియమించనున్నారు. అలాగే ఎస్పీ స్థాయి అధికారులు డీసీపీలుగా ఉంటారు. కమిషనరేట్‌లో ఒక కమిషనర్‌తో పాటు ఇరువురు జాయింట్ కమిషనర్‌లు, ఇరువురు ఎల్ అండ్‌వో డీసీపీలు ఉంటారు. తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి కలిపి ఒక డీసీపీ ఉంటారు. గుంటూరు నగరంతో పాటు మిగిలిన ప్రాంతాలకు మరో డీసీపీ ఉంటారు.
అలాగే కమిషనరేట్‌లో ఎల్‌అండ్‌వోకు ఒక జాయింట్ కమిషనర్, మిగిలిన వాటికి మరో జాయింట్ కమిషనర్ ఉంటారు. అర్బన్ పరిధిలో కొత్తగా ఆరు ఎల్ అండ్‌వో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి సబ్ డివిజన్‌లు కూడా అందుకు అనుగుణంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న తుళ్లూరు పోలీస్ స్టేషన్‌ను రెండుగా విభజించాలని భావిస్తున్నారు. సెక్రటేరియెట్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలతో సెక్రటేరియెట్ పోలీస్‌స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తాడేపల్లి మున్సిపాలిటీని తాడేపల్లి టౌన్ స్టేషన్‌గా, మిగిలిన గ్రామాలతో తాడేపల్లి రూరల్ స్టేషన్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మంగళగిరి టౌన్‌లో ఇక్కడ అదనంగా మరో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. నవులూరు కేంద్రంగా మరో స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పెదకాకాని పోలీస్ స్టేషన్‌ను రెండుగా, నల్లపాడు పోలీస్ స్టేషన్‌ను కూడా రెండుగా విభజించాలని నిర్ణయించారు. గోరంట్ల కేంద్రంగా మరో పోలీస్ స్టేషన్‌ను, హైవేకు ఇరువైపుల ఉన్న గ్రామాలతో నల్లపాడు పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టాబిపురం, అరండల్‌పేట పోలీస్ స్టేషన్ల పరిధి అధికంగా ఉండటంతో ఈ రెండు పోలీస్ స్టేషన్ల నుంచి మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమరావతి రోడ్డులో కొంత భాగంను కలిపి గుజ్జనగుండ్ల కేంద్రంగా మరో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడికొండ, తుళ్లూరు స్టేషన్లతో ఒక సబ్ డివిజన్, తాడేపల్లి టౌన్, రూరల్, నవులూరు కలిపి ఒక సబ్ డివిజన్, మంగళగిరి టౌన్, రూరల్, యూనివర్సిటీతో మరో సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పెదకాకాని, గోరంట్ల, గుజ్జనగుండ్ల స్టేషన్లతో మరో సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవి కాక ప్రస్తుతం ఉన్న ఈస్ట్, వెస్ట్, సౌత్ సబ్ డివిజన్‌లు యదావిధిగా కొనసాగున్నాయి. దీంతో ఎల్ అండ్‌వోకు మొత్తం ఏడుగురు డీఎస్పీలు రానున్నారు. వీరిలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి సబ్ డివిజన్‌లను కలిపి ఒక డీసీపీ కిందకు తీసుకురానున్నారు. మిగిలిన ఈస్ట్, వెస్ట్, సౌత్, గోరంట్ల సబ్ డివిజన్‌లను మరో డీసీపీ కిందకు తీసుకురానున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో ఒక ఎస్పీ, గుంటూరు పరిధిలో మరో ఎస్పీ రానున్నారు. నూతన కమిషనరేట్‌లో కొత్తగా మరో మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఒక సైబర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తుళ్లూరులో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. కొత్తగా తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు టౌన్‌లో మూడు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ట్రాఫిక్ స్టేషన్‌లకు ఒక డీఎస్పీ, టౌన్ స్టేషన్లకు ఒక డీఎస్పీ ఉంటారు. వీరిద్దరిపైన ట్రాఫిక్‌కు ప్రత్యేకంగా ఒక డీసీపీ ఉంటారు. రాజధానిలో ప్రత్యేకంగా సైబర్ పోలీస్ స్టేషన్, అడ్వాన్స్‌డ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం గుంటూరు కేంద్రంగా ఉన్న ఏఆర్ విభాగాన్ని కూడా రెండుగా విభజించాలని ప్రతిపాదించారు. తాడేపల్లిలో సగం ఎఆర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు. మొబైల్ రిజర్వు ఫోర్స్‌గా పిలుస్తారు. గుంటూరులో కోర్టు, జైలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్ వంటి వాటికి మిగిలిన ఫోర్స్ విధులు నిర్వహిస్తారు. దీనిని సిటీ సెక్యూరిటీ విభాగం పిలుస్తారు. అర్బన్‌లో తాడేపల్లి, పాతగుంటూరు, వంటి అనేక స్టేషన్లలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్లను కూడా అప్‌గ్రేడేషన్ చేయాలని ప్రతిపాదించారు. దీని కారణంగా సిబ్బంది సంఖ్య పెరగనుంది.
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్