ఏపీకి కొత్తగా 1.24 లక్షల ఇళ్లు
అమరావతి : కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి మరోసారి భారీ స్థాయిలో పక్కా ఇళ్లు మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాలకు కొత్తగా 1,24,624 గృహాలు మంజూరు చేస్తునట్టు కేంద్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రకటించారు. ఆయన అధ్యక్షతన అన్ని రాష్ట్రాల గృహ నిర్మాణశాఖల కార్యదర్శులతో ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రతిపాదనల మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ బెనిఫిషియరీ లెడ్ కనస్ట్రక్షన్ (బీఎల్‌సీ)లో కేంద్రం వీటిని ప్రకటించింది. దీనివల్ల కేంద్రం వాటా కింద రాష్ర్టానికి రూ.800 కోట్ల మేర నిధులు రానున్నాయి. కాగా.. రాష్ట్రంలో పీఎంఏవై పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఏపీ గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పట్టణ ప్రాంత గృహాల కింద 80 వేలు, గ్రామీణ ప్రాంతాల కేటగిరీ కింద మరో లక్ష ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని కేంద్రానికి తెలిపారు. సమీక్ష సందర్భంగా కేంద్ర కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో చేపడుతున్న గృహనిర్మాణ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోపే పూర్తి చేయాలని అన్ని రాష్ర్టాలకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. కేంద్ర ఇచ్చిన నిధుల వ్యయానికి సంబంధించి యూసీలు ఎప్పటికప్పుడు సమర్పిస్తే.. కొత్త ఇళ్ల మంజూరుతోపాటు నిధులు కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఏపీకి కొత్తగా 1.24 లక్షల ఇళ్లు