3.70 లక్షల డిపాజిటర్లకు చెల్లింపులు : సీఎం


నవంబరు 07, 2019
గుంటూరు



• గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌


• రూ.10వేల లోపు డిపాజిట్‌దార్ల కోసం రూ.264 కోట్ల సహాయం :  సీఎం


• 3.70 లక్షల డిపాజిటర్లకు చెల్లింపులు : సీఎం


• గుంటూరులో లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌


• తక్షణమే బాధితుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ 


• నమోదు చేసుకోలేని డిపాజిట్‌దార్లకు మరో నెల గడువు


• వారికీ వచ్చే నెలలో సహాయం చేస్తాం


• రూ.20 వేల లోపు డిపాజిట్‌దార్లకూ త్వరలో చెల్లింపు


• అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం


• ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నాం


గుంటూరు : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత కేవలం 5 నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.  సుదీర్ఘ పాదయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు, బాధలు స్వయంగా చూశానని, అందుకే ఆ సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారందరికీ న్యాయం చేసే విధంగా రూ.264 కోట్లు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. దీని ద్వారా దాదాపు 3.70 లక్షల డిపాజిటర్లకు మేలు జరుగుతుందన్నారు.  అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి కూడా త్వరలో న్యాయం చేస్తామన్నారు.  అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఇంకా ఎవరైనా తమ పేర్లు నమోదు చేసుకోకపోతే, వారికి మరో నెల అవకాశం ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. వారికి కూడా వచ్చే నెలలో చెల్లిస్తామని చెప్పారు. 


 ఇచ్చిన మాట ప్రకారం రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు చెల్లింపు కార్యక్రమం గురువారం ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది.  గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ  కార్యక్రమంలో సీఎం లాంఛనంగా కంప్యూటర్‌ బటన్‌ నొక్కడంతో బాధితుల ఖాతాల్లోకి నగదు జమ అయింది. 


 అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని విపక్ష నేతగా హామీ ఇచ్చిన శ్రీ వైయస్‌ జగన్, అనతి కాలంలోనే ఆ మాట నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి చెల్లించే విధంగా గత నెల 18న రూ.263.99 కోట్లు విడుదలకు ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 3,69,655 మంది అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు ఊరట లభించింది.  


 రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించేలా తొలి బడ్జెట్‌లోనే రూ.1,150 కోట్లు కేటాయించారు. తమను ఆదుకోవాలని గత ప్రభుత్వ హయాంలో అగ్రి గోల్డ్‌ బాధితులు ఎంత వేడుకున్నా అప్పటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే ఆదుకుంటామన్న మాటకు కట్టుబడి... ఇవాళ అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కార్యక్రమానికి సీఎం వైయస్‌.జగన్‌ శ్రీకారం చుట్టారు.  


  ముందుగా తాడేపల్లి నుంచి నేరుగా గుంటూరు చేరుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో వివిధ ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు. అనంతరం వేదికపై అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు జమ కార్యక్రమాన్ని లాంఛనంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. 


కష్టాలు చూశాను. సాయం చేస్తానన్న మాట నిలబెట్టుకున్నాను : ముఖ్యమంత్రి


 కష్టంలో ఉన్నా సహాయం చేసే పరిస్థితి ఉంటుందా? ఉండదా? అన్న ఆవేదనతో ఉన్న వారు, కష్టం తీర్చేందుకు మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చాడని ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడికి పేరు పేరునా శిరస్సు వంచి అభివాదం చేస్తున్నానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అన్నారు. 


 ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు గత అయిదేళ్లుగా పడుతున్న కష్టాలు, బాధలు స్వయంగా చూశానని, 3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో వారు తనను కలిసి బాధలు చెప్పుకున్నప్పుడు, వారిని ఆదుకుంటానన్న ఒకే ఒక మాట చెప్పి, హామీ ఇచ్చిన విషయాన్ని శ్రీ వైయస్‌.జగన్‌ గుర్తు చేసుకున్నారు. 


 ఆ మాట నిలబెట్టుకుంటూ దాదాపు 3.70 లక్షల అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు దాదాపు రూ.264 కోట్లు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.  'మీ అందరి ఆశీస్సులతో మీ తమ్ముడు ఈ పని చేయగలుగుతున్నాడు.  ఇచ్చిన మాట ప్రకారం రూ.20 వేల లోపు డిపాజిటర్లకు కూడా త్వరలో చెల్లిస్తాము. నిజానికి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. సంస్థ ఆస్తులన్నీ కోర్టు పరిధిలో ఉన్నా, ఒక్కో ముడి విప్పుతూ, ఇవాళ దాదాపు 3.70 లక్షల డిపాజిటర్లకు కోర్టు అనుమతితో న్యాయం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తాము. రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారందరికీ కూడా కోర్టు అనుమతితో త్వరలో చెల్లిస్తాము' అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు.


మంత్రివర్గ తొలి సమావేశంలోనే....


 నిజానికి అగ్రిగోల్డ్‌ సంస్థ ప్రైవేటుదని, ఈ కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగిందని, అయినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని, పైగా దురాశతో ఆ సంస్థ ఆస్తులు కొట్టేయాలని చూశారని సీఎం చెప్పారు. అందుకే అగ్రిగోల్డ్‌ బాధితులను రక్షించేందుకు నాడు ప్రతిపక్షంగా పోరాడామని, ఇప్పుడు వారికి న్యాయం చేసే దిశలో అడుగులు వేస్తున్నామని సగర్వంగా చెబుతున్నానన్నారు. 


 తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, అగ్రిగోల్డ్‌ బాధితులకు సహాయం చేసేందుకు  మంత్రివర్గ తొలి సమావేశం రోజు, జూన్‌ 10న తీర్మానం చేశామని, ఆ తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాల్లో జూలై 12న బడ్జెట్‌ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆ విధంగా అధికారం చేపట్టిన  కేవలం 5 నెలల్లోనే దాదాపు 3.70 లక్షల మంది డిపాజిటర్లకు రూ.264 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. 


ప్రతి ఒక్కరికీ మేలు–దాదాపు 4 లక్షల ఉద్యోగాలు :


 ఈ 5 నెలల కాలంలోనే ప్రతి ఇంట్లో ఒకరిగా మెలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, వాటిలో దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన నియమించామని, ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చామని సీఎం వెల్లడించారు.


2.25 లక్షల డ్రైవర్లకు:


 సొంతంగా ఆటోలు, క్యాబ్‌లు నడుపుకునే డ్రైవర్లకు ఇచ్చిన హామీ అమలు చేస్తూ, 1.75 లక్షల మందికి ఏటా రూ.10 వేల సహాయం ఇచ్చే విధంగా అడుగులు వేశామని చెప్పారు. ఈ నెల వరకు దరఖాస్తు చేసుకునే వారికి  కూడా అవకాశం ఇస్తూ మరో 50 వేల మందికి లబ్ధి చేకూరుస్తామని, ఆ విధంగా దాదాపు 2.25 లక్షల మందికి సహాయం చేస్తున్నామని తెలిపారు.


46 లక్షల రైతు కుటుంబాలకు


 రైతుల కష్టాలు చూశాం కాబట్టి వారికి సాగు పెట్టుబడిగా 5 ఏళ్ల పాటు, ఏటా రూ.13,500 చొప్పున సహాయం చేస్తున్నామని చెప్పారు. దాదాపు 46 లక్షల రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్సార్‌ రైతు భరోసా అమలు చేస్తున్నామని వివరించారు.


నామినేషన్‌ పనులు, నామినేటెడ్‌ పదవుల్లో:


 దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేషన్‌పై ఇచ్చే పనులు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించామని, ఇది కూడా 5 నెలలు తిరగక ముందే అమలు చేశామని సీఎం చెప్పారు.


దాదాపు 3 రెట్లు ఎక్కువ


 అవ్వా తాతల పెన్షన్‌ పెంచామన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, వారికి గత 5 ఏళ్లలో అప్పటి ప్రభుత్వం సగటున నెలకు రూ.500 కోట్లు ఇస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.1300 కోట్లు ఇస్తోందని వెల్లడించారు. ఆ విధంగా గత ప్రభుత్వం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ ఇస్తున్నామని చెప్పారు.


పిల్లలకు అండగా.. 


 చదువుకుంటున్న ప్రతి పిల్లవాడికి తోడుగా ఉంటానని మాట ఇచ్చానని, ఆ మేరకు దాదాపు 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశామని గుర్తు చేశారు.


కంటి వెలుగు


 కంటి వెలుగు పథకంలో 65 లక్షల విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. వారిలో దాదాపు 4.5 లక్షల విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు, అవసరమైన శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామని వివరించారు. 


రివర్స్‌ టెండరింగ్‌–ప్రయోజనం


 కేవలం 5 నెలల్లోనే ఎక్కడా అవినీతికి తావు లేకుండా పలు చర్యలు చేపట్టామన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రస్తావించారు. దీన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపుతున్నాయన్న ఆయన, రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఒక్క  పోలవరం ప్రాజెక్టులోనే దాదాపు రూ.830 కోట్లు ఆదా చేశామని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టులో దాదాపు రూ.50 కోట్లు మిగిల్చామని, ఆ విధంగా కేవలం ఈ 5 నెలల్లోనే దాదాపు రూ.1000 కోట్ల ప్రజాధనం ఆదా చేయగలిగామని వివరించారు. 


వారికీ నెల రోజుల అవకాశం


 ఇప్పుడు వేదికపై కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా అగ్రిగోల్డ్‌ బాధితుల్లో దాదాపు 3.70 లక్షల మంది ఖాతాల్లో డబ్బు జమ అవుతుందన్న సీఎం, ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోతే కంగారు పడొద్దని చెప్పారు. వారికీ న్యాయం చేస్తామని, సహాయం చేస్తామని తెలిపారు.
 
అర్హులైన డిపాజిటర్లు ఎవరైనా ఇంకా నమోదు చేసుకోకపోతే, వారికీ అవకాశం కల్పిస్తామని, వారు జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థలో నమోదు చేసుకోవాలని, ఒకవేళ దానిపై అవగాహన లేకపోతే కలెక్టరేట్‌లు, ఎమ్మార్వో కార్యాలయాలు, గ్రామ సచివాలయాలకు వెళ్లాలని సూచించారు. 
వారందరికీ మరో నెల రోజుల సమయం ఇస్తామని, నమోదు చేసుకున్న వారికి వచ్చే నెలలో సహాయం చేస్తామని చెప్పారు.   
రాబోయే రోజుల్లో అందరి చల్లని దీవెనలతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నానంటూ సీఎం తన ప్రసంగం ముగించారు.
చివరగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన 3,69,655 మందికి రూ.263,99,00,983 సహాయం చేస్తూ, మెగా చెక్కు కాపీని లాంఛనంగా బాధితులకు సీఎం అందించారు.
 
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి మేకతోటి సుచరిత, శ్రీ మోపిదేవి వెంకటరమణ, శ్రీ సీహెచ్‌.రంగనాథరాజు, మండలిలో చీఫ్‌ విప్‌ శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు తాడికొండ శ్రీదేవి, విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 


దేవుడిలా ఆదుకున్నారు:


 కార్యక్రమంలో తొలుత మాట్లాడిన పలువురు అగ్రిగోల్డ్‌ బాధితులు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివరిస్తూ, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తమను ఆదుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు.


విశ్వనాథ్‌. కల్లూరు.అనంతపురం జిల్లా 


– మాకు న్యాయం చేయాలని ఎన్నో రకాలుగా పోరాడాం. కానీ మాజీ సీఎం చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో విషం తాగి 300కు పైగా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఉంటే, వారిలో రూ.20 వేలు డిపాజిట్‌ చేసిన వారు 14 లక్షల మంది ఉన్నారు. వారికి రూ.1150 కోట్లు ఇస్తే న్యాయం జరిగేది. కానీ చంద్రబాబు అస్సలు ఇవ్వలేదు. అందుకు లేనిపోని కారణాలు చెప్పారు. 
 ఆ సమయంలో మా కోసం బాసట కమిటీ ఏర్పాటు చేసిన అప్పటి విపక్ష నేత శ్రీ వైయస్‌ జగన్, ఆ కమిటీకి లేళ్ల అప్పిరెడ్డిని కన్వీనర్‌గా నియమించారు. మాకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఒక దేవుడు. ఇప్పటికీ కొందరు తమ పేర్లు నమోదు చేసుకోలేదు. కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించాలి.


బెజ్జం రత్నమేరి, ప్రత్తిపాడు:


– నేను కూలీ పని చేసుకుని బతికేదాన్ని. నా కొడుకు పుట్టినరోజున అందరికీ చాక్లెట్లు పంచితే వారిలో కొందరు ఇచ్చిన డబ్బులను అగ్రిగోల్డ్‌ సంస్థలో తొలి నెలలో పెట్టుబడిగా పెట్టాను. ఆ తర్వాత కూలీ పని చేస్తూ సంపాదించిన మొత్తాన్ని నెల నెలా కడుతూ పోయాను. కానీ అగ్రిగోల్డ్‌ సంస్థ మమ్మల్ని ముంచేసింది. నా కొడుకు అనారోగ్యం పాలైతే చికిత్స కోసం డబ్బులు లేక ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా, ప్రభుత్వం డబ్బు ఇస్తోందని మెసేజ్‌ వచ్చింది. అందుకే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాకు ఒక దేవుడు. ఆయన నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోతారు. 


*ఎన్‌.కృష్ణలేఖ, నాదెండ్ల మండలం-అగ్రిగోల్డ్‌ సంస్థ ఏజెంట్‌:*


– గత 5 ఏళ్లలో అప్పటి ప్రభుత్వం మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టింది. మేము సంస్థ కోసం ఎంతో కష్టపడ్డాము. కేసులు ఎదుర్కొన్నాము. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నాము. అయినా మా కష్టాలు, బాధలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు పాదయాత్రలో గుంటూరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి కష్టాలు చెప్పుకుంటే, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇవాళ మాకు న్యాయం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకుంటున్నారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. అగ్రిగోల్డ్‌కు వెలకట్టలేని ఆస్తులున్నాయి. వాటిని విక్రయించి బాధితులందరికీ న్యాయం చేయండి.