అమరావతిలో అభివృద్ధి ఎక్కడ జరిగింది?
అమరావతి : గత ఐదేళ్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో గ్రాఫిక్స్‌తో కాలం గడిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని సూటిగా ప్రశ్నించారు. నేడు రాజధాని రైతలు చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదని తెలిపారు. గత ఐదేళ్లు హాలీవుడ్ సినిమాల్ని తలదన్నేలా గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పిన దానికి, చేసిన దానికి పొంతన లేదని ఆరోపించారు. అమరావతిపై మాట్లాడుతున్న చంద్రబాబు.. రాజధాని ప్రకటనపై నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ప్రపంచంలో ఎక్కడైనా కేంద్రీకరణ ఉందా అని బుగ్గన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రపంచమంతా వికేంద్రీకరణ విధానాలను అమలు చేస్తున్నారని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో రాజధాని టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని చెప్పారు. రూ. 5వేల కోట్లు ఖర్చు పెట్టి రూ. 52 కోట్లకు టెండర్లు పిలుస్తారా అని ప్రశ్నించారు. రూ. 5వేల కోట్లు కూడా బ్యాంక్‌ల నుంచి అప్పుగా తెచ్చారని మండిపడ్డారు. కి.మీ రోడ్డుకు రూ. 46 కోట్లకు టెండర్ ఇచ్చారని.. ఏమైనా స్వర్గానికి రోడ్డు వేస్తున్నారా అని నిలదీశారు. అడుగు నిర్మాణానికి రూ. 6,999కు టెండర్ ఇచ్చారని మండిపడ్డారు. కేవలం రూ. 277 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు అమరావతి గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఆస్తులన్నీ అమ్ముకుంటామని చంద్రబాబే చెప్పారని.. అదేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారమా అని నిలదీశారు. ఎల్లో మీడియా ఉందని ఇష్టమొచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నారని విమర్శించారు.
చంద్రబాబు అవినీతిని బయటపెడతాం : చంద్రబాబు అవినీతికి సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటపెడతామని అన్నారు. ప్రపంచబ్యాంకు, ఏఐఐబీలకు అప్పు అడగడానికి వెళ్తే.. టెండర్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను వారు ప్రశ్నించలేదా అని నిలిదీశారు. 3 ప్యాకేజీల కోసం 4 కంపెనీలు టెండర్లు వేస్తే.. అన్నింటిలో ఒకేలా బిడ్‌లు వేశారని తెలిపారు. చంద్రబాబు వల్లే హైదరబాద్‌లో ఐటీ పరిశ్రమ అబివృద్ధి చెందలేదన్నారు. హైటిక్ సిటీ బిల్డింగ్ కడితే హైదరాబాద్‌ను కట్టినట్టా అని ఎద్దేవా చేశారు.
విశాఖపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? : విశాఖపట్నంపై చంద్రబాబుకు ఎందుకంత కోపమని బుగ్గన నిలదీశారు. విశాఖను ఎందుకు అభివృద్ధి చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. గతంలో రాజధాని వచ్చిన మేధాపాట్కర్‌ను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు మూడేళ్ల ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎందుకు ఇళ్లు కట్టుకోలేదో చెప్పాలన్నారు. రాజధానికి, సింగపూర్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. సింగపూర్‌లోని వ్యాపార సంస్థ మాత్రమే ఇక్కడకు వచ్చిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల ద్వారా మానవ అభివృద్ధికి పాటుపడుతున్నారని.. మానవ అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.
అమరావతిలో అభివృద్ధి ఎక్కడ జరిగింది?