*చిధ్రంగా మారిన గ్రామీణ అంతర్గత రోడ్లు* (పొంచి ఉన్న అంటువ్యాధులు)

చిధ్రంగా మారిన గ్రామీణ అంతర్గత రోడ్లు


 వింజమూరు: వింజమూరు మండలంలో గురువారం నాడు కురిసిన కొద్దిపాటి వర్షం, శుక్రవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా పడుతున్న జల్లులతో గ్రామీణ ప్రాంతాలలోని అంతర్గత రోడ్లు చిత్తడి చిత్తడిగా చిధ్రంగా మారాయి. మండల కేంద్రమైన వింజమూరులోని బి.సి కాలనీ, లెక్కలవారిపాళెం, గంగమిట్ట, బొమ్మరాజు చెరువు ప్రాంతాలతో పాటు రావిపాడు, కాటేపల్లి, తమిదపాడు, వన్నూరప్పపాళెం, బత్తినవారిపల్లి, నందిగుంట, తక్కెళ్ళపాడు, చంద్రపడియ, బుక్కాపురం తదితర గ్రామాలలో అంతర్గత రోడ్లు బురదమయమయ్యాయి. మురికి కాలువలలో పూడికతీత చర్యలు చేపట్టక పోవడంతో వాటిలోని బురద వర్షపు నీటితో మిళితమై రోడ్లపైకి చేరుతుండటంతో భరించరాని దుర్వాసన వెదజల్లుతున్నదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కాలువల వద్ద బ్లీచింగ్ చల్లించిన దాఖలాలు లేవని వారంటున్నారు. ఇటీవల పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించినప్పటికీ మొక్కుబడి తంతుగా సాగించారని విమర్శలు చేస్తున్నారు. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో దారులు వెంబడి మురికి నీరు ప్రవహిస్తుండటంతో దోమలు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయని, పగలు రాత్రి తేడా లేకుండా దోమల ధాటికి అల్లాడిపోతున్నామని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్వచ్చ భారత్ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వింజమూరు మండలంలోని పలు గ్రామాలలో ఆ దిశగా అడుగులు వేసిన సందర్భాలు అమావశ్యకో పున్నమికో అనే సామెతను గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలలో వర్షాకాల సమయాలలో అయినా పారిశుద్ధ్య పనులను చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు...