జగన్ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోంది: యనమల
పశ్చిమగోదావరి : జగన్ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని దుయ్యబట్టారు. కేసులతో ప్రతి కోర్టుకు హాజరవుతారని విమర్శించారు. జగన్ కుటుంబ చరిత్ర అందరికీ తెలుసునని అన్నారు. ప్రజాస్వామ్యం అన్నాక నాయకులు ఉద్యమాలు చేస్తారని, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. మంగళవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను యనమల పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చింతమనేని కళ్లు చింతనిప్పుల్లా ఉంటాయని, అందుకే అధికార పక్షానికి భయం అని వ్యాఖ్యానించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ మహా నాయకుడేమీ కాదని అన్నారు. వైసీపీ క్యాబినెట్‌లో 80శాతం మంత్రులు, 60శాతం ఎమ్మెల్యేలు నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోంది: యనమల