శ్రీసిటీలో పాత తరం కార్ల ప్రేమికులకు కనువిందు

 





 

శ్రీసిటీ - అంతిమతీర్పు. 8-12- 2019


శ్రీసిటీలో ఫియట్ వింటేజ్ కార్ల ర్యాలీ, ప్రదర్శన  


-   పాత తరం కార్ల ప్రేమికులకు కనువిందు 


 


శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద ఆదివారం ఉదయం క్లాసిక్ ఫియట్ కార్ల పరిశీలన పరిసర ప్రాంత ప్రజలను ఎంతగానో అలరించింది. దశాబ్దాల పాటు వాహన  రంగంలో తిరుగులేని  బ్రాండుగా  వెలుగొందిన ప్రీమియర్ పద్మినితో సహా,   1952-1990 సంవత్సరాల మధ్య తయారైన  ఫియట్ యొక్క వివిధ మోడళ్ళకు చెందిన 13 కార్లు శ్రీసిటీ సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ వేలో క్యూకట్టి చూపరులకు చూసే అవకాశం కల్పించింది. ఫియట్ క్లాసిక్ కార్ క్లబ్-చెన్నై (ఎఫ్‌సి 4) సభ్యులు వార్షిక డ్రైవ్‌లో భాగంగా తమ క్లాసిక్ ఫియట్స్‌లో చెన్నై నుండి శ్రీసిటీకి వచ్చి మెగా ర్యాలీ నిర్వహించారు. 



ఆదివారం ఉదయం 11.30 గంటలకు శ్రీసిటీ ప్రవేశద్వారం నుండి 
కార్ల ర్యాలీ
ప్రారంభమైంది. జీరో పాయింట్ నుంచి  సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌వేలోని మామిడి రిసార్ట్‌లోకి వెళ్లి, వెనక్కి తిరిగి, శ్రీసిటీలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు బిజినెస్ సెంటర్‌కు చేరుకోవడంతో ర్యాలీ ముగిసింది. 



క్లబ్ వ్యవస్థాపకుడు సుంజీత్ సుధీర్ నేతృత్వంలో 
సహ వ్యవస్థాపకుడు మిస్టర్ మను ప్రసాద్, మోడరేటర్లు వినోత్ రాగం, కోశాధికారి కళ్యాణ్ కిషన్ సింగ్ సహా 25 మంది సభ్యుల బృందం ర్యాలీలో పాల్గొన్నారు. వీరంతా చెన్నైలోని  పలు  ప్రఖ్యాత వ్యాపార సంస్థల అధినేతలు. శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ వారికి సాదర స్వాగతం పలికి, ర్యాలీలో పాల్గొన్నారు. బిజినెస్ సెంటర్ వద్ద శ్రీసిటీ మౌళిక వసతులు, ప్రత్యేకతలు గురించి వారికి వివరించారు.



సుంజీత్ సుధీర్ మాట్లాడుతూ, చెన్నైలోని  ఔత్సాహిక ఫియట్ ప్రేమికులందరినీ ఒకచోట చేర్చి, వారిలో స్నేహాన్ని పెంచుకోవడమే క్లబ్ యొక్క ఉద్దేశ్యంగా తెలిపారు. సంవత్సరానికి ఒకసారి క్లబ్ సభ్యులు లాంగ్ డ్రైవ్‌కి వెళతారన్నారు. ఈ సంవత్సరానికి శ్రీసిటీని ఎంచుకున్నామన్నారు. తమ ప్రతిపాదనను అంగీకరించి, గొప్ప ఆతిథ్యంతో సందర్శనను నిర్వహించినందుకు మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల పట్ల ముగ్దులైన వారంతా  ఈ పర్యటన  తమందరికీ మరచిపోలేని  ఒక మధురానుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. శ్రీసిటీలో 185 కి పైగా కంపెనీలు, 50 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించబడ్డాయని తమకు ఇప్పటివరకు తెలియదన్నారు. ఉద్యోగుల్లో సగానికి పైగా మహిళలు వుండడం చాలా ప్రత్యేకతమన్నారు. 

కాగా, వింటేజ్ కార్ ర్యాలీ, ప్రదర్శనను ఫియట్ క్లాసిక్ కార్ క్లబ్-చెన్నై (ఎఫ్‌సి 4) మరియు శ్రీసిటీ సంయుక్తంగా నిర్వహించాయి.  చెన్నైలో క్లాసిక్ ఫియట్స్ కోసం ఏర్పాటైన ఈ  ప్రత్యేకమైన క్లబ్ సభ్యుల వద్ద, 1952-1990 సంవత్సరాల మధ్య తయారైన  ప్రీమియర్  పద్మినీతో సహా ఫియట్ యొక్క వివిధ మోడల్ కార్లు ఉన్నాయి.