ఐసోలేషన్ వార్డులుగా మారిన రైల్వే కోచ్‌లు...
* కోవిడ్-19 నియంత్రణకు ద.మ రైల్వే ప్రత్యేక చర్యలు
* రైల్వేబోర్డు సూచించిన లక్ష్యానికి అనుగుణంగా 486 రైలు కోచ్‌లు మార్పు
* అత్యంత క్లిష్ట సమయంలోనూ ప్రయాణికుల ఆరోగ్యభద్రతకు ద.మ రైల్వే పెద్దపీట
హైైదరాబాద్ ఏప్రిల్ 24: కోవిడ్-19తో జరిగే పోరాటంలో జాతి ప్రయత్నాలకు దోహదంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశలో భారతీయ రైల్వే బహుముఖ వ్యూహాలను అమలుచేస్తూ ముందడుగు వేస్తుంది. ఈ ప్రయత్నాలలో భాగంగా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా ఐదు వేల నాన్ ఏసి ప్రయాణికుల కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలని అన్ని రైల్వే జోన్‌లకు సూచించింది. ఈ క్రమంలో 5000 నాన్ ఏసి కోచ్‌ల సంఖ్యలో దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క లక్ష్యంగా 486 కోచ్‌లు తయారు చేయాలని రైల్వే బోర్డు సూచించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. నిర్దేశించిన లక్ష్యంలోగా ఆయా కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలని సంకల్పించారు. చేపట్టిన కార్యాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయాలని లాలాగూడ మరియు తిరుపతి వర్క్‌షాప్‌లకు సూచిస్తూ జోన్‌లోని 6 డివిజన్లు, 2 వర్క్‌షాప్‌లు ఈ కార్యభారాన్ని పంచుకోవాలని ఆదేశించారు. అదుకు అనుగుణంగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 120 కోచ్‌లు, హైదరాబాద్ డివిజన్ పరిధిలో 40 కోచ్‌లు, విజయవాడ డివిజన్ పరిధిలో 50 కోచ్‌లు, గుంతకల్లు డివిజన్ పరిధిలో 61 కోచ్‌లు, నాందేడ్ డివిజన్ పరిధిలో 30 కోచ్‌లు, గుంటూరు డివిజన్ పరిధిలో 25 కోచ్‌లు చొప్పున లాలాగూడ వర్క్‌షాప్‌లో 76 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్‌లో 84 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్పు చేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దక్షిణ మధ్య రైల్వే రంగంలోకి దిగడంతో పాటు శాఖాపరంగా సూచించిన లక్ష్యంలోగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని 486 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్పు చేసింది. ప్రతి ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితుల కోసం 8 కూపేలు మరియు వైద్య సిబ్బంది కోసం ఒక కూపే ఉంటాయి. రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కోచ్‌లలో స్నానాల గది, 3 టాయిలెట్లు, కూపేల మధ్య తెరలు, అవసరమైన ఎలక్ట్రిక్ మరియు వైద్య పరికరాలు కూడా అమర్చారు. ఆయా కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా నిర్దేశించిన లక్ష్యంలోగా రూపొందించడంలో కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ముఖ్యంగా మెకానికల్ విభాగాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు.
అత్యంత క్లిష్ట సమయంలోనూ ప్రయాణికుల ఆరోగ్యభద్రతకు ద.మ రైల్వే పెద్దపీట