*20.04.2020*
*అమరావతి*
*ఆర్థిక ఇబ్బందుల్లోనూ 'సున్నా వడ్డీ'
*పొదుపు సంఘాల ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు*
*24న సీఎం శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా పథకం పునఃప్రారంభం*
*93 లక్షల మంది మహిళలకు ప్రయోజనం*
కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం తాత్సారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు చేస్తూనే గత సర్కారు హయాంలో ఆగిపోయిన ఓ పెద్ద పథకానికి రాష్ట్ర ప్రభుత్వం జీవం పోస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీఎం శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పథకాన్ని పునఃప్రారంభించనున్నారు. దీని ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రూ.1,400 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
*2016 నుంచి ఆగిన పథకం*
పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై జీరో వడ్డీ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచే అమలులో ఉంది. అయితే చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా నిధులు విడుదల చేయకుండా ఈ పథకం అమలును పూర్తిగా పక్కన పెట్టింది. 2016 జూన్ నుంచి జీరో వడ్డీ పథకం అమలుకు నోచుకోవడం లేదు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తిరిగి ప్రారంభించనుంది.
*8.78 లక్షల సంఘాలకు సాయం..*
► రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.95 లక్షల సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.975 కోట్ల సాయం అందనుంది. పట్టణ ప్రాంతాల్లోని 1.83 లక్షల సంఘాలకు రూ.425 కోట్ల చొప్పున జీరో వడ్డీతో లబ్ధి చేకూరుతుంది. ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండే మొత్తం 93 లక్షల మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
► ఈ పథకానికి సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రభుత్వం తాజాగా రూ.765.19 కోట్లను విడుదల చేసింది. మిగిలిన నిధులను ప్రభుత్వం గతంలోనే సెర్ప్, మెప్మాలకు విడుదల చేసింది. పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు సోమ, మంగళవారాల్లో విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.
► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి జీరో వడ్డీ పథకం అమలుకు రూ.765.19 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.