*ఇంటిని తలపిస్తున్న నిరాశ్రయుల వసతి గృహాలు*
💐 *కరోనా కష్టకాలంలో నిరాశ్రయులకు జిల్లా యంత్రాంగం ఆపన్న హస్తం*
💐 *రిలీఫ్ క్యాంపుల్లో రుచికరమైన భోజనంతో పాటు యోగా శిక్షణ, మెరుగైన వైద్య సేవలు అందించడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరాశ్రయులు*
జిల్లా వ్యాప్తంగా 26 రిలీఫ్ క్యాంపుల్లో 2,091 మందికి వసతి
*చిత్తూరు, ఏప్రిల్ 26:* ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలలో ఉపాధి నిమిత్తం వలసలు వెళ్ళిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుండి లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సొంత ఊర్లకు చేరుకునేందుకు బయలుదేరి ఎంతో మంది మధ్యలోనే నిరాశ్రయులు కావడం జరిగింది. అలా చిత్తూరు జిల్లాకు చేరుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి జిల్లా యంత్రాంగం ఆపన్న హస్తం అందిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 26 రిలీఫ్ క్యాంపుల్లో 2,091 మంది వసతి పొందుతున్నారు. ఇందులో చిత్తూరులో 7, తిరుపతి – 5, మదనపల్లె -2, వాల్మీకిపురం – 1, యాదమరి – 1, బంగారుపాలెం – 1, శ్రీకాళహస్తి – 1, చంద్రగిరి – 1, రేణిగుంట – 2, పలమనేరు -1, కలికిరి – 1, పుంగనూరు – 1, ఐరాల – 1, కలకడ – 1 లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వసతి గృహాల నందు మన రాష్ట్రానికి చెందిన వారితో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మాహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, హర్యానా, సిక్కిం, గుజరాత్, నేపాల్, పంజాబ్ లకు చెందిన వారు కలరు. వీరందరికీ బస భోజన సౌకర్యం తో పాటు స్యానిటైజర్ లు, మాస్క్ లు కూడా అందజేయడం జరుగుతున్నది. ఈ వసతి గృహాల్లో ప్రత్యేకంగా వారి అభిరుచులకు అనుగుణంగా భోజన సౌకర్యం లేదా వారే తయారు చేసుకునేందుకు అవసరమైన నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరుగుతున్నది. దీనితో పాటు ఆహ్లాదకరంగా వారి ఆరోగ్యం ఉండేందుకు ప్రశాంత వాతావరణం ఉండే విధంగా యోగా శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించడం ప్రత్యేకత. ప్రధానంగా రిలీఫ్ క్యాంపుల్లో ఉదయం యోగా గురువుల ద్వారా ప్రాణాయామం నేర్పించడంతో పాటు ఉత్తరాది వంటకాలను అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఉన్నట్లైతే వారికి పాలు, గుడ్లు, పండ్లు అందజేయడం జరుగుతున్నది.
*వసతి గృహాల్లో వసతి పొందుతున్న వారి అభిప్రాయం వారి మాటల్లో . . .*
*కోయంబత్తూరు నుండి రాజస్థాన్ కు వెళ్ళే క్రమంలో* మదనపల్లె సమీపాన పోలీసు అధికారులు తనిఖీ చేసి వాల్మీకిపురం లోని బాలయోగి గురుకుల పాఠశాలకు మమ్మల్ని తరలించి మాకు ప్రతి రోజు ఉత్తరాధి వంటకాలైన రోటి, దాల్ తో పాటు, పిల్లలకు అవసరమైన పాలు, గుడ్లతో పాటు స్నానానికి అవసరమైన వేడి నీళ్ళతో పాటు అన్నీ వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, మమ్మల్ని కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారని, ప్రతిరోజూ ఉదయం సాయంత్రం టీ, స్నాక్స్ అందిస్తున్నారని తెలిపారు. దీనితో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మేము ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ను కూడా చేయించడం జరుగుతున్నదని, ప్రతి రోజు మాకు ఉన్న వసతుల పై తహశీల్దార్ వచ్చి పరిశీలించడం జరుగుతున్నదని, ఈ విధంగా వసతులను ఏర్పాటు చేసిన *మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు రాజస్థాన్ కు చెందిన ధర్మేంద్ర కుమార్, రమేశ్ కివార్, ప్రదీప్ సింగ్, మగన్ సింగ్ లు.*
*చిత్తూరులోని సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ హాస్టల్ నందు వసతి పొందుతున్న వారి అభిప్రాయాలు వారి మాటల్లో* . . . వసతి గృహం నందు మాకు అవసరమైన పేస్ట్, బ్రష్, సోప్ లతో పాటు మంచి ఆహారాన్ని కూడా అందిస్తున్నారని, ప్రతి రోజు యోగా చేయించడం తో పాటు, వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని, *గుంటూరు నుండి చిత్తూరు కు చేరుకున్న వలస కార్మికులు గోపి తెలిపారు.*
మాకు ఈ వసతి గృహం నందు పిల్లలకు అవసరమైన ఆట వస్తువులతో పాటు మంచి ఆహారం, పండ్లు కూడా అందిస్తున్నారని, నా భర్త రైల్వే ట్రాక్ లను శుభ్రం చేసే పని చేస్తారని, తిరుపతికి వెళ్లలేక నా భర్త, 5 సం. ల నా కొడుకుతో కలసి ఈ వసతి గృహం నందు ఆశ్రయం పొందుతున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో మాకు మంచి ఆశ్రయాన్ని అందించిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు *తిరుపతి కి చెందిన శాంతి.*
*తిరువణ్ణామలై నుండి కాణిపాకం దర్శనం నిమిత్తం రావడం జరిగిందని* , లాక్ డౌన్ నేపథ్యంలో తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్నానని ఇక్కడ ఇంటిని తలపించే విధంగా వసతులు కలవని, ఉదయాన్నే టీ ఇవ్వడంతో మొదలై యోగా శిక్షణ ఇస్తున్నారని, పరిసరాలను ప్రతి రోజు వచ్చి మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయడం జరుగుతుందని, మా ఇంట్లో కూడా ఈ విధంగా వసతులు లేవని, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు *తిరువణ్ణామలై కి చెందిన కాశినాథన్.*
*తిరుత్తణి నుండి మదనపల్లెలోని తన కూతురు ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో* లాక్ డౌన్ సందర్భంగా చిత్తూరు నందు బస్సులు ఆపేయడంతో వసతి గృహంకు అధికారులు తీసుకునిరావడం జరిగిందని ఈ వసతి గృహం నందు మంచి భోజనం అందిస్తున్నారని, ఎటువంటి లోటు లేకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారని సిబ్బంది అందరూ మంచి గా ఆదరిస్తున్నారని తెలిపారు *తిరుత్తణికి చెందిన పెరుమాళ్.*
-