*పారిశుద్ధ్య కార్మికులకు మాసాంతం జీ.పి.ఆర్ చేయూత* 30 మందికి నిత్యం అల్పాహారం అందజేత.... వింజమూరు, ఏప్రిల్ 27 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షులు గున్నం.ప్రసాద్ రెడ్డి ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో తన ఉదారతను చాటుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వింజమూరు మేజర్ పంచాయితీలో ప్రతినిత్యం 30 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు నిత్యం వింజమూరులో పారిశుద్ధ్యమును మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు. గతంలో పరిస్థితులు ఎలాగున్నా ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో మాత్రం కార్మికులు పారిశుద్ధ్య పనుల విషయంలో నిరంతరం సేవలు అందిస్తున్నారని చెప్పవచ్చు. లాక్ డౌన్ లో భాగంగా టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు సైతం మూతపడ్డాయి. పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ తెల్లవారు జామునే విధుల్లోకి వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న బి.జె.పి నేత గున్నం.ప్రసాద్ రెడ్డి తన స్వంత నిధులతో నెల రోజులుగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా తయారు చేయించిన అల్పాహారం ప్యాకెట్లును అందజేస్తూ వారికి ఉదయం పూట ఆకలి దప్పులను తీర్చుతున్నారు. అంతేగాక ఇటీవల కూడా స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో మండల బి.జె.పి నేతల సమన్వయంతో జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులకు భారీ స్థాయిలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ చైనాలోని ఊహాన్ సిటీలో రూపాంతరం చెంది ఖండాంతరాలు దాటి ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ మానవాళి మనుగడకు పెను సవాల్ గా మారడం విచారించదగిన విషయమన్నారు. భారతదేశంలో ఈ వైరస్ నియంత్రణకు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు. జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ కావడంతో ప్రజలను కరోనా రక్కసి కబంధ హస్తాల నుండి రక్షించుకునేందుకు ఏకైక మార్గంగా లాక్ డౌన్ ప్రక్రియకు ప్రధానమంత్రి వ్యూహం రచించడం జరిగిందన్నారు. దీనితో కరోనాను మన దేశంలో కొంతమేర కట్టడి చేసినట్లయిందన్నారు. అభివృద్ధి చెందిన పలు దేశాలు ముందుచూపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ చోటుకున్న విషాదకర సంఘటనలను మనం నిత్యం ప్రసార సాధనాల ద్వారా వీక్షిస్తూనే ఉన్నామన్నారు. కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాత్రం కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న ముందు జాగ్రత్త విధానాలతోనే కరోనా వ్యాప్తిని నియంత్రించినట్లవుతున్నదన్నారు. అసలే అంతంత మాత్రంగా ఉంటున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ లాక్ డౌన్ వలన ఆర్ధిక మూలాలు పతనమవుతున్నప్పటికీ లెక్కచేయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన దేశ ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుండటం దేశ ప్రజల అదృష్టమని గున్నం.ప్రసాద్ రెడ్డి అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు మాసాంతం జీ.పి.ఆర్ చేయూత - 30 మందికి నిత్యం అల్పాహారం అందజేత