తేది: 29.04.2020
అమరావతి
రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒపి సేవలను యధావిధిగా కొనసాగించాలి
*ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రానికి తెచ్చేందుకు చర్యలు*
*జిల్లాల్లో చిక్కుకున్న వారిని స్వంత జిల్లాలకు చేర్చేందుకు కృషి*
*మంత్రుల బృందం స్పష్టీకరణ*
అమరావతి,29ఏప్రిల్:కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరోనా పై ఏర్పాటు చేయబడిన మంత్రులు బృందం స్పష్టం చేసింది.ఈ మేరకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన మంత్రుల బృందం(GOM) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కరోనా నేపధ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరును మంత్రుల బృందం సమీక్షించింది.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తదితర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా ఓపి సేవలు అందించడం లేదని సమావేశం దృష్టికి తేగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపి సేవలు అందించాలని దీనీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రుల బృందం అధికారులకు స్పష్టం చేసింది.
అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల కు చెందిన వలస కూలీలు వారు రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారా లేక వారి రాష్ట్రాలకు వెళ్ళాలని అకుంటున్నారో తెల్సుకుని ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని జిఓయం అధికారులను ఆదేశించింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చే వలస కూలీలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇంకా ఈ మంత్రుల బృందం సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించి అధికారులకు తగిన మార్గనిర్దేశం చేసింది.
ఈ మంత్రుల బృందం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యం) ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి,హోం మంత్రి యం.సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, హరికృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్,సియంఓ అదనపు సిఎస్ డా.పివి రమేశ్,టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్,ఐజి వినీత్ బ్రిజ్లాల్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.