నాటుసారా నిరోధించడంలో పోలీస్ పాత్ర పెరగాలి.
మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి.
గుంటూరు, ఏప్రిల్ 28(అంతిమ తీర్పు) : ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులు లేకపోవడం వలన నాటుసారా ఉత్పత్తి, వినియోగం గణనీయంగా పెరుగుతుందని, ఈ నేపథ్యంలో నాటుసారా నిర్మూలనకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బందితోపాటు పోలీస్ పాత్ర గణనీయంగా పెరగాలని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ఈనెల 28 న రాష్ట్ర హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత ను కలిసి వివరించారు.లాక్ డౌన్ కారణంగా 3500 ప్రభుత్వ మద్యం షాపులు, 800కు పైగా బార్ లు మూతపడటం వలన మద్యం వ్యసనపరులు నాటుసారా, గంజాయి, కల్తీకల్లు లాంటి మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారని వీటన్నిటికీ సమూలంగా నిర్మూలించడానికి పరిమితంగా ఉన్న ఎక్సైజు సిబ్బందికి పోలీస్ యంత్రాంగం తోడ్పాటు నoదించాలని రాష్ట్ర హోం శాఖ మాత్యులు సుచరిత ను కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మాత్యులు మేకతోటి సుచరిత స్పందిస్తూ రాష్ట్ర డిజిపిని కలిసి మాట్లాడుతానని నాటుసారా, గంజాయి,కల్తీకల్లు లాంటి మత్తు పానీయాల నిర్మూలనకు పటిష్టమైన కృషి చేయవలసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ సిబ్బంది ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారని నల్లబెల్లం వినియోగాన్ని అరికడుతున్నారని వి. లక్ష్మణ రెడ్డి వివరించారు. ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజిల్ పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని అభినందించారు.