అమరావతి, ఏప్రిల్ 16.(అంతిమ తీర్పు):
ప్రపంచమంతా లాక్ డౌన్ అంటుంటే.. జగన్ ఎన్నికలు ఎన్నికలు అంటున్నారు
ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు మొట్టికాయలేసినా బుద్ది రాలేదా..
రాష్ట్రంలో ద్విభాషా సూత్రాలను అమలు చేయాల్సిందే
-కె.ఎస్.జవహర్
10 నెలల్లో హైకోర్టుతో 50కి పైగా మొట్టికాయలు వేయించుకున్న ఘనత దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. జగన్మోహన్ రెడ్డి అజ్ఞానపు కూటమిలో తెలివైన వాడు అనుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా కొట్టుకుపోతున్నాడు. మిడిమిడి జ్ఞానంతో జగన్ ఆదేశిస్తే.. మంత్రిగా కనీసం ఆలోచించకుండా ముందుకు వెళ్లడం బాధాకరం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తెలుగుదేశం అడ్డుకుంటోందనడం సిగ్గుచేటు. ఒకసారి రికార్డులు పరిశీలించండి. ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు, అందులో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టింది ఎవరో తెలుసుకోండి. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి కనిపిస్తుంది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, పిల్లల కోసమే అని చెబుతూ.. ద్విభాషా సూత్రాలను, 1964 కొఠారి కమిషన్ సూచనలను తుంగలో తొక్కుతున్నారు. లగ్జెంబర్గ్ లో త్రిబాషా సూత్రాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న విషయాన్ని గుర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం భావ స్వేచ్ఛ, నేర్చుకునే హక్కు విద్యార్ధులదే. ఇంగ్లీష్ మీడియంపై ఇంత హడావుడి చేసిన ప్రభుత్వం ఎంతమంది ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ బోధనలో శిక్షణ ఇప్పించింది.?
స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సర్వేపల్లి రాధాకృష్ణ, నల్ల సూరీడు నెల్సన్ మండేలా మాతృ భాషతోనే జ్ఞాన సముపార్జన సులభమని, సులభంగా గ్రహించడంతో పాటు భావ వ్యక్తీకరణ కూడా సులభం అవుతుందని చెప్పిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. విద్యా బోధన మాద్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు ప్రతి విద్యార్ధికీ ఉంది. డిసెంబర్ నాటికి గానీ పుస్తకాలు పంపిణీ చేయలేకపోయారు. మధ్యాహ్న భోజనం అతీగతీ లేకుండా పోతోంది. అలాంటి వీరు కూడా నాడు-నేడు అంటూ హడావుడి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఇస్తామన్న డీఏ, పీఆర్సీ, సీపీఎస్ రద్దు ఏమయ్యాయి. మీ పది నెలల ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ఏం ఒరగబెట్టారు.? సదుపాయాల్లేని స్కూళ్లు, గురుకులాలు కనిపించడం లేదా.?
ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు తీర్పును సుప్రాం కోర్టులో సవాల్ చేస్తామంటున్న మంత్రిగారూ... ఏనాడైనా హైకోర్టు సూచనలపై న్యాయ నిపుణులతో చర్చించారా.? కొఠారి కమిషన్ చెప్పిన కామన్ సిలబస్ విధానం గురించి ఎప్పుడైనా ఆలోచించారా.? ముఖ్యమంత్రి, మంత్రులకు హైకోర్టు తీర్పు గురించి కనీసం అవగాహన కూడా లేకపోవడం మన దౌర్భాగ్యం. ఇవేమీ చేయకుండా.. ఒంటెత్తుపోకడలతో విద్యార్ధులను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇప్పటికైనా అభ్యాసనా సంసిద్ధత విధానాల గురించి ప్రభుత్వం ఆలోచించాలి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ గారు రాసిన లేఖ ఫోర్జరీ చేసినదంటూ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. లేఖ ఫోర్జరీ అంటూ.. ఫోర్జరీలు చేసి జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి మాట్లాడడం హాస్యాస్పదం. ఏ 2 రెడ్డి జీవితమంతా ఫోర్జరీలు, మార్ఫింగ్, ఉన్నది లేనట్లు చూపించడం, లేనిది ఉన్నట్లు చూపించడం అని మరిచినట్లున్నారు. నీకున్న అవలక్షణాలు, అవినీతి బురదను దళిత నేత వర్ల రామయ్యకు ఆపాదించడం దుర్మార్గం. విజయసాయి రెడ్డి రాసిన లేఖపై పరువు నష్టం దావా దాఖలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెడతాం. అడవి జంతువులు అడవిలో ఉండాలి. నేరస్తులు జైల్లో ఉండాలని విజయసాయిని చూస్తే అర్ధమవుతోంది. దొంగ సంతకాలు, ఫోర్జరీలు చేసి ఎన్ని కేసుల్లో ఏ 2గా ఉన్నాడో మరిచిపోయారనుకుంటా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికే విపత్తుగా మారిన కరోనాను కూడా తన రాజకీయాలకు వాడుకోవాలని చూస్తోంది. ప్రజల ప్రాణాలు పోతున్నా.. కేసుల విషయంలో తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారంతో ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. గుంటూరును రెడ్ జోన్ లో ఉంచేందుకు కేసులు ఎక్కువ చూపిస్తున్నారు. విశాఖకు వెళ్లడమే ధ్యేయంగా కేసులు లేవంటూ తప్పుడు లెక్కలు చెబుతోంది. దేశమంతా లాక్ డౌన్ కావాలి అంటుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికలు కావాలంటున్నారు. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం లేదు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు కరోనాను కట్టడి చేయడం చేతకాక.. చంద్రబాబు గారిపై పడి ఏడుస్తున్నారు. చంద్రబాబు గారి అనుభవాన్ని, సూచనలను దేశమంతా పాటిస్తోంది. కానీ.. జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదు. ఇళ్లు తగలబడుతుంటే.. నుయ్యి తవ్విన చందంగా కరోనాపై జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.