ప్రభుత్వ నిర్లక్ష్యం విలువ ప్రజల ప్రాణాలు కరోనా లెక్కల్లో కోత
- మాజీమంత్రి యన్.యం.డి.ఫరూఖ్
అమరావతి, ఏప్రిల్ 27(అంతిమ తీర్పు): కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి ఏపీ ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వం పట్టనట్లుగా ఉంది. దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు పగలనకా, రేయనకా కాలికి బలపం కట్టుకొని శ్రమ చేసి తమ ప్రజలకు భరోసా, ధైర్యానిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం తాడేపల్లి రాజప్రసాదానికి అంకితమయ్యి పబ్జీ ఆడుకుంటున్నారు అని మాజీమంత్రి యన్.యం.డి.ఫరూఖ్ అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉంటూ ప్రజల ధన,మాన, ప్రాణాలను కాపాడేందుకు అకుంఠిత దీక్షతో పని చేయాలి. కాని ఏపీ ప్రభుత్వం మాత్రం అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి విరుద్దంగా ప్రజల ప్రాణాలను కాపాడే పని తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తుంది.
కరోనా మహామ్మారి ఏ విధంగా రాష్ట్ర ప్రజలను ఆవహించి ప్రజల ప్రాణాలను హరిస్తుందో ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏపీ ప్రభుత్వం కరోనాను కప్పిపెట్టి రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు కృషి చేయడం సిగ్గుచేటు. గుంటూరులో షేక్. సుభాని అనే వ్యక్తి కరోనా వైరస్ వ్యాప్తితో మోన్న (25.04.2020)న మరణిస్తే ప్రభుత్వం ఎందుకు మరణాల సంఖ్యలో చేర్చలేదు? ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు. ఆయనను క్వారంటైన్ లోనే ఉంచి సరైన సమయంలో చికిత్సను అందించడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది.
కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య, టెస్టులు ఇలాంటి ఏమీ ప్రభుత్వం భయటపెట్టడం లేదు. ఆరోగ్యశాఖ ఒక సమాచారం ఇస్తే సీఎం డ్యాష్ బోర్డులో మరో సమాచారం ఉంటుంది. శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతుంది. అంతేకాకుండా జగన్ కు ఎన్నికలు, రాజధాని మార్పు మీద ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణ చేయడంలో లేదు.
ప్రజలకు ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఉన్న సమాచారాన్ని నిస్పక్షపాతంగా భయటపెడితే వాస్తవాలు తెలుస్తాయి. వారికి పరిస్థితి ఎంత ఘోరంగో ఉందో అర్ధం అవుతుంది. తద్వారా జాగ్రత్తలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పడం వలన ప్రజలు ఏమీ లేదనుకొనే అపోహలో ఉంటారు. కరోనాను తక్కువ చేసి చూపించి రాజకీయంగా ప్రయోజనం పొందే కుట్రకు జగన్ తెరలేపారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నేడు గుంటూరు, కర్నూలు, శ్రీకాళహస్తి ప్రజలు ప్రాణాలను అరచేత్తో పట్టుకొని బ్రతకాల్సిన దుస్థితికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా వాస్తవాలను భయటపెట్టి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని
యన్.యం.డి.ఫరూఖ్ మాజీ మంత్రి అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం విలువ ప్రజల ప్రాణాలు కరోనా లెక్కల్లో కోత - మాజీమంత్రి యన్.యం.డి.ఫరూఖ్