గూడూరు, ఏప్రిల్ 22,(అంతిమ తీర్పు).: .ఆకలి అంటే అన్నం పెట్టేవాళ్ళు ఉండొచ్చు. అవసరం అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండచ్చు. కానీ ప్రాణాలు నిలబెట్టే రక్తాన్ని ఇవ్వమంటే ఇచ్చేవారు ఎందరుంటారు. అందులోనూ కరోనా వైరస్ తో సతమతమౌతున్న ఈరోజుల్లో రక్తాన్ని ఎవరిస్తారు. దీంతో రక్త సేకరణ గగనంగా మారింది. ఇప్పటికే బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు నిండుకున్నాయి. ఈ క్రమంలో దాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కనుమూరి హరిచంద్రా రెడ్డి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన పిలుపుతో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసింది. ఎందరో ప్రాణాలు నిలబెట్టేందుకు వారి వంతు పాత్ర పోషించింది.
ఎక్కడ చూసినా కరోనా..కరోనా..కరోనా... ఈ కోవిడ్ 19 వైరస్ ప్రజలను అంత భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో గత నెల 23 నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రవాణా పూర్తిగా స్తంభించి పోవడంతో ప్రమాదాల సంఖ్య తగ్గినా రక్తం అవసరం ఉన్నా సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎనీమియా, కిడ్నీ, డయాలసిస్ వంటి వ్యాధిగ్రస్థులకు రక్తం అవసరం ఎక్కువగానే ఉంటుంది. గతంలో నిండుకుండలా ఉండే రక్త నిల్వ కేంద్రాలు నేడు నిండుకున్నాయి. రక్తం లేక నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దాతలు కరోనా వైరస్ నేపథ్యంలో రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనికితోడు ప్రజల ఎవరు బయట తిరగరాదన్న ఆంక్షలతో రక్తం సేకరణ కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో దాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి రక్త దానం చేయాలని తన ట్రస్ట్ కనుమూరి హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిలుపునిచ్చారు. పిలుపునందుకున్న గూడూరు పరిసర ప్రాంతాలకు చెందిన యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. గూడూరు లోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి సమాజ హితం కోసం తన పాత్ర పోషించింది.