కూలీలను తరలిస్తున్న ఆటో డ్రైవర్లపై కేసు నమోదు
వింజమూరు, ఏప్రిల్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో శనివారం ఉదయం అధిక సంఖ్యలో కూలీలను పనులకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్.ఐ బాజిరెడ్డి అరెస్ట్ చేయడంతో పాటు ఆటోను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరణ నేపధ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వైరస్ నియంత్రించబడే వరకు ప్రజలు స్వీయ నిర్భందంలోనే ఉండాలని, సమదూరం పాటించాలనే స్పష్టమైన ఆదేశాలున్నాయన్నారు. వింజమూరు మండలం గ్రీన్ జోన్ అంటే పూర్తిగా సడలిపులు ఇచ్చిన విధంగా ప్రజలు భావించడం సరికాదన్నారు. కూలీ పనులకు వెళ్ళే వారు సమదూరం పాటిస్తూ అతికొద్ది మంది మాత్రమే వెళ్ళాలన్నారు. ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు నడుచుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటోవాలాలు ఈ విషయాలను గమనించాలన్నారు. గుంపులు గుంపులుగా కూలీలను తరలిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్.ఐ స్పష్టం చేశారు.