కోడి పందేల స్థావరాలపై ఎస్.ఐ మెరుపు దాడులు - 16 బైకులు, రూ.11,500 నగదు స్వాధీనం - 8 మంది అరెస్ట్... వింజమూరు, మే 3(అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం కాటేపల్లి పంచాయితీ పరిధిలోని మాధవనగర్ పొలాలలో ఆదివారం మధ్యాహ్నం కోడి పందేల స్థావరాలపై ఎస్.ఐ బాజిరెడ్డి మెరుపు దాడులు నిర్వహించారు. వివరాలలోకి వెళితే మాధవనగర్ పొలాలలో ఆదివారం నాడు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఎస్.ఐ బాజిరెడ్డికి ముందస్తు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో ఎస్.ఐ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాటేపల్లి పరిసరాలలో కానిస్టేబుళ్ళను మఫ్టీలో ఉంచి నిఘా ఏర్పాటు చేశారు. వారి నుండి ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారంతో కోడి పందేలు జరుగుతున్నాయని నిర్ధారించుకుని ఒక్కసారిగా దాడులు చేశారు. పలువురు తప్పించుకోగా 8 మంది కోడి పందెం రాయుళ్ళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 11 వేల 500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న 16 ద్విచక్ర వాహనాలను రెండు ట్రాక్టర్లు పిలిపించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా సరే పేకాట, కోడి పందేలు, మద్యం బెల్టు షాపులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్బడితే ఉపేక్షించేది లేదన్నారు.ఇలాంటి వాటిపై తాము ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. మండల ప్రజలందరూ కూడా వీటి నియంత్రణ దిశగా కృషి చేయాలని కోరారు. తన మొబైల్ నెంబరు 9440796375 కు సమాచారం అందించాలని, వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ కూడా స్వీయ నిర్భంధంలో ఉండి కరోనా వైరస్ ను కట్టడి చేయాల్సిన అవసరముందన్నారు.
కోడి పందేల స్థావరాలపై ఎస్.ఐ మెరుపు దాడులు - 16 బైకులు, రూ.11,500 నగదు స్వాధీనం - 8 మంది అరెస్ట్.