ఈనెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగింపు

ఈనెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగింపు.
*జాతీయ రహదారులపై నడిచి వెళ్ళేవారిని శిబిరాల్లో పెట్టి ఆహారం, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించి రైళ్ళలో స్వరాష్ట్రాలకు పంపాలి.


కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.


అమరావతి,17మే: ఈనెలాఖరు వరకూ లాక్ డౌన్ ను పొడిగించడం జరిగిందని కావున నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను ఆదేశించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యలు,ఈనెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలుపై ఆయన ఆదివారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల వెంబడి వలస కూలీలు ఎవరూ నడిచి వెళ్ళకుండా నివారించాలని స్పష్టం చేశారు.కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని చెప్పారు.
ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.


రాష్ట్ర,అంతరాష్ట్ర పరిధిలో వాహనాలు మూమెంట్ పై రాష్ట్రాలు ఆయా పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతిచోట ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు.లాక్ డౌన్ ను ఈనెలాఖరు వరకూ పొడిగించిన నేపధ్యంలో హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను సక్రమంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాత్రి 7గం.ల నుండి ఉదయం 7గం‌.ల వరకూ రాత్రి కర్ఫ్యూ ను కొనసాగించాలని చెప్పారు.
లాక్ డౌన్ విధించి 54 రోజులు పూర్తయిందని మరో 14 రోజులు పొడిగించినందున వైరస్ వ్యాప్తి నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.అంతేగాక వృద్ధులు, గర్భిణీలు,చిన్నారులు,కోమార్భిడిటీ లక్షణాలు ఉన్న వారిని వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు స్పష్టం చేశారు.


ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.