ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో సోషల్ డిస్టెన్స్ కు చెల్లుచీటీ
.. వింజమూరు, మే 8 (రిపోర్టర్- దయాకర్ రెడ్డి): ప్రజలు సమదూరం పాటిస్తేనే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చునని ప్రభుత్వాలు, అధికారులు పదే పదే గొంతు చించుకుని ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో పలుచోట్ల ప్రజలకు ఏ మాత్రం చెవికెక్కడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దారిన పోయే కరోనాను తమ దగ్గరకు ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా బ్యాంకుల వద్ద ఖాతాదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులలో మాత్రం కరోనా నిబంధనలు అటకెక్కుతున్నాయి. వింజమూరు, చాకలికొండలలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులలో ఈ పరిస్థితులు బ్యాంకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. బ్యాంకుల వద్ద చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్లు, సబ్బులు, డెటాల్ వంటి వాటిని సిద్దంగా ఉంచాలని ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఖాతాదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల వద్ద మాత్రం కరోనా నియంత్రణ చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.