బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వివిధ అంశాలపై లేఖ వ్రాసారు.
ముందుగా కన్నా లక్ష్మీనారాయణ గారు లాక్-డౌన్ నేపథ్యంలో భయంకరమైన విశాఖపట్నం గ్యాస్-లీక్ బాధితులను పరామర్శించడానికి అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
విశాఖపట్నం గ్యాస్-లీక్ ప్రమాదంలో మరణాలు మరియు వేలాది మంది బాధితుల ఆసుపత్రిపాలవడం హృదయాన్ని కలచి వేసిందని కన్నా లక్ష్మీనారాయణ . ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాస్-లీక్ బాధితులను కలుసుకొని వారి పరిస్థితి చూడటం,స్థానిక ప్రజలతో మాట్లాడటం మరియు కర్మాగారాన్ని సందర్శించిన తరువాత దుర్ఘటన సంభవించిన తీరు చూస్తే ఖచ్చితంగా ఈ దుర్ఘటన మానవ తప్పిదం వలనేనని అర్ధమవుతుందని కన్నా లక్ష్మీనారాయణ లేఖలో వివరించారు.ఫ్యాక్టరీ బాధ్యత రహిత వైఖరి సృష్టమవుతోందని లేఖలో తెలిపారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ సాంకేతిక నిపుణుల సహకారంతో హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని ఘటనపై న్యాయ విచారణలను నియమించాలని కోరారు.ఇలాంటి చట్టపరమైన చర్యల వలన మాత్రమే నిజాలు నిగ్గుతేలుతాయని కన్నా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సహాయ చర్యలను కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు.ముఖ్యంగా బాధితులు వారి జీవితాంతం ఈ విషపూరిత స్టైరెన్ గ్యాస్ లీక్ యొక్క ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.బాధితులందరూ చాలా పేదవారు కావడంతో తరువాత వైద్య ఖర్చులు భరించలేరు.అందువల్ల,లీకేజీ సమయంలో ఈ వాయువును పీల్చుకోవడం వల్ల ఏదైనా అనారోగ్యనికి గురైన సందర్భంలో వారి చికిత్సకు శాశ్వత ఆరోగ్య కార్డులు జారీ చేయాలని లేఖ ద్వారా కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.